Tuesday, April 16, 2019

Notre Dame Church Fire

             Notre Dame Church Fire

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో మంటల ధాటికి కుప్పకూలిన ప్రసిద్ధ పురాతన చర్చి నోట్రే  డామే కేథడ్రల్‌ను పునర్‌నిర్మిస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ప్రకటించారు. ఈ ఘటనతో యావత్తు దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యిందని ఆయన తెలిపారు. అనేక గంటల పాటు నిరంతరాయంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా చిన్నపాటి మంటలు ఎగిసిపడుతుండడంతో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చే వరకు అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తూనే ఉంటారని మేక్రాన్‌ తెలిపారు. అలాగే ఫ్రెంచ్‌ బిలియనీర్‌ ఫ్రాంకోయిస్‌ హెన్రీ పినాల్ట్‌ చర్చి పునర్‌నిర్మాణానికి 100 మిలియన్‌ యూరోలు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంటలు భయానకంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆకాశం నుంచి నీటిని చల్లి మంటలను అదుపులోకి తీసుకురావాలని సూచించారు. కానీ దీని ద్వారా చర్చి పూర్తిగా నేలమట్టం అయ్యే ప్రమాదం ఉందని భావించిన అగ్నిమాపక అధికారులు ఆ మార్గాన్ని ఎంచుకోలేదు.
చర్చిలో ఆధునికీకరణ పనులు కొనసాగుతుండగా ఒక్కసారిగా సోమవారం సాయంత్రం మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో చర్చి పైకప్పు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం గమనార్హం. 850ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కట్టడంతో ఫ్రాన్స్‌ ప్రజలది విడదీయరాని బంధం. ఫ్రెంచి నిర్మాణ శైలికి దీన్ని తార్కాణంగా చెబుతుంటారు. ఫ్రెంచి విప్లవం, పారిస్ స్వాతంత్ర్య పోరాటం లాంటి పలు కీలక ఘట్టాలకు ఈ చర్చి సాక్ష్యంగా నిలిచింది. ఇంతటి చరిత్ర ఉన్న ఈ కట్టడం ఒక్కసారిగా మంటలకు ఆహుతవుతుండడంతో దేశ ప్రజలంతా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.
                Notre Dame Church Fire 



Tags :   notre dame church  paris  fire 

No comments:

Post a Comment