Thursday, April 18, 2019

Urmila Comment PM Modi Movie


                  మోడి పై కామెడీ సినిమాలన్నా ఊర్మిళ 

ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తీసిన బయోపిక్‌ను ప్రముఖ సినీనటి, కాంగ్రెస్‌ నాయకురాలు ఊర్మిళా మతోండ్కర్‌ తప్పుపట్టారు. ఆయనేం సాధించారని బయోపిక్‌ తీశారంటూ ప్రశ్నించారు. ఆయనపై బయోపిక్‌ కంటే ఒక కామెడీ సినిమా తీస్తే సరిగ్గా సరిపోతుందని విమర్శలు గుప్పించారు. ఆ సినిమాలో 56 అంగుళాల ఛాతీ ఉన్న ఒక వ్యక్తిని దేశానికి ప్రధానిని చేసినా ఏమీ చేయలోకపోయారనే సన్నివేశాల్ని చూపించాలని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారాల్లో ఎన్నో హామీలు గుప్పించి తీరా ప్రధాని అయ్యాక వాటిని తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన విధానాన్ని చూపించాలన్నారు.
మోదీ బయోపిక్‌ ‘పీఎం నరేంద్ర మోదీ’పై పెను దుమారమే రేగింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దీని విడుదలను నిలిపివేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం..  ఇందుకు నిరాకరించింది. అయితే ఆ తర్వాత అనేక అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ చిత్రాన్ని విడుదల చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదం మరోసారి సుప్రీంకు చేరడంతో ఎన్నికల అధికారులు సినిమాను వీక్షించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఇటీవల అధికారులు సినిమాను వీక్షించారు. దీనిపై ఈసీ నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. ఊర్మిళ ముంబయి నార్త్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే రెండు విడతల పోలింగ్‌ పూర్తయింది. ఓట్ల లెక్కింపు మే 23న జరగనుంది
Tags: URMILA  MUMBAI  ELECTION INDIA  PM MODI  CONGRESS  BJP 

No comments:

Post a Comment